దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది.
By అంజి Published on 21 Sep 2023 7:18 AM GMTదసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.
''బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలి'' టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను సంస్థ వీసీ అండ్ ఎండీ వి.సి.సజ్జనర్ తో కలిసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఈ బస్సుల ప్రత్యేకతలను వారు పరిశీలించారు. ఈ నెల 23 నుంచి ఈ బస్సులు నగర ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం "ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ కష్టాల్లో ఉన్నా ప్రజలకు రవాణా కష్టాలు రాకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూనే ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను మరింతగా పెంచేలా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ కు ధీటుగా టీఎస్‌ఆర్టీసీ పనిచేస్తోందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ గారు బాధ్యతలు స్వీకరించాక గత రెండేళ్ల కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.