జాతీయ రహదారులపై టోల్ చార్జీలను 5 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలు నేటి(శనివారం ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం పెంచిన ఐదుశాతం టోల్ చార్జీలను ప్రయాణీకుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.
ఆర్టీసీ టికెట్‌లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచారు. దీంతో టికెట్ రేటు కాస్త పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. గరుడ ప్లస్ మొదలు ఆర్డినరీ బస్సుల వరకు ఒక్కో టికెట్‌పై 4 రూపాయలు పెంచారు. నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున టోల్ చార్జీలను వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సిటీ ఆర్డినరీ బస్సులు టోల్ ప్లాజాల మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిల్లో కూడా టోల్ చార్జీలు పెరిగాయి.