వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఎండీ ఇమ్రాన్ నర్సంపేట పేట పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఎంబీఏ వరకు చదివిన తర్వాత అతడు కారుణ్య నియామకం ద్వారా కొన్ని ఏళ్ల క్రితం నర్సంపేట డిపోలో కండక్టర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లు పాటు కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఇమ్రాన్.. ప్రస్తుతం వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో అకౌంట్ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ పోచమ్మ గుడి దగ్గరలో ఉన్న తన ఇంటిలో ఇమ్రాన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇమ్రాన్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎండీ ఇమ్రాన్ ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఇమ్రాన్ ఆత్మహత్యతో నర్సంపేట ఆర్టీసీ డిపోలో తీవ్ర కలకలం రేగింది. ఇమ్రాన్ ఆత్మహత్యకు పాల్పడడంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.