టీఎస్ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి.. రికార్డు స్థాయిలో ఆదాయం
TSRTC Earns over RS 165 cr revenue during Sankranti.టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కలిసి వచ్చింది
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2023 12:18 PM ISTతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)కి సంక్రాంతి పండుగ కలిసి వచ్చింది. భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపగా విశేష ఆదరణ లభించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయడంతో పాటు ముందుగానే రానుపోను(అప్ అండ్ డౌన్) టికెట్‌ను బుకింగ్ చేసుకుంటే 10 రాయితీ ఇచ్చినప్పటికీ రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల్లో రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది టీఎస్ ఆర్టీసీ. తద్వారా 165.46 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరింది. గతేడాదితో పోలిస్తే రూ.62.29 కోట్లు అదనపు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక కి.మీ.ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కి.మీ.ల మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 26.60 లక్షల కి.మీ.లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతిరోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిచాయి. ఇక ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగింది. గతేడాది 59.17 ఆక్యుపెన్సీ ఉంటే ఈ సారి 71.19 శాతానికి పెరిగింది.
టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోమారు నిరూపించారని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సాధారణ చార్జీలతోనే 3, 923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. రద్దీకి అనుగుణంగా సిబ్బంది అద్భుతంగా పని చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్ధతతో పని చేశారనీ, వారి కృషి వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని ఎండి సజ్జన్నార్ అన్నారు.హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కేపీహెచ్‌బి, బోయిన్‌పల్లిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామనీ, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం బయో టాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించాలన్నారు. అలాగే రవాణా, పోలీస్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఈ సందర్భంగా బాజిరెడ్డి, సజ్జన్నార్ లు ధన్యవాదాలు తెలియజేశారు.