సాధారణ ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ విజ్ఞప్తి

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది.

By అంజి  Published on  20 Feb 2024 6:12 AM GMT
TSRTC, common commuters, VC Sajjanar, Telangana

సాధారణ ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ విజ్ఞప్తి 

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయని ఆర్టీసీ తెలిపింది. ''ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం'' అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడపుతోందన్నారు. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని, దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందన్నారు. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరారు. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story