తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కి రాఖీ పండుగ కలిసి వచ్చింది. పండుగ రోజున రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్క రోజే రూ.20.11కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో వచ్చింది. ఆక్యూపెన్సీలోనూ రికార్డు సృష్టించింది.
సంస్థ రోజు వారీ ఆదాయాన్ని రూ.15.59 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ రకరకాల ఛార్జీల పెంపుతో సోమవారాల్లో సులువుగానే లక్ష్యం దాటుతుండగా.. మిగిలిన రోజుల్లో రూ.13 నుంచి రూ.15 కోట్ల వస్తోంది. రాఖీ పండుగ నేపథ్యంలో శుక్రవారం ఒక్క రోజే రూ.20.11 కోట్ల ఆదాయం వచ్చింది. లక్ష్యాన్ని మించి వసూళ్లు రావడంతో అధికారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
అత్యధికంగా కరీంనగర్ జోన్‌లో 8.74 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.5.84 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో రూ.5.47 కోట్ల ఆదాయం లభించింది. 38.77లక్షల మంది ప్రయాణీకులు శుక్రవారం ప్రయాణించారు. దీంతో సగటు ఆక్యుపెన్సీ 86.84 శాతంగా నమోదైంది. నల్లగొండ రీజియన్‌లో అత్యధికంగా 101.01 శాతం, మెదక్ రీజియన్‌లో 94.44 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.