గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేసింది. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. పేపర్ లీక్ అయిన వ్యవహారం కారణంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాధారాలు రుజువైన కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు జనవరి 22న జరిగిన ఏఈఈ, పిబ్రవరి 26న జరిగిన డీఏఓ పరీక్షలను కూడా రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మిగతా పరీక్షల తేదీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటనలో వెల్లడించింది.
ఇదిలావుంటే.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 3.8 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 25 వేల మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ కు అర్హత సాధించిన 25 వేల మంది విద్యార్థుల భవిష్యత్ పై ఆందోళన నెలకొంది. గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దుపై.. మెయిన్స్ కు అర్హత సాధించిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.