TSPSC: రాబోయే పరీక్షల కోసం తాజా ప్రశ్న పత్రాలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుజాగ్రత్త చర్యగా రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం తాజా ప్రశ్నపత్రాలను సిద్ధం చేయనుంది.
By అంజి Published on 17 March 2023 10:16 AM ISTTSPSC: రాబోయే పరీక్షల కోసం తాజా ప్రశ్న పత్రాలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుజాగ్రత్త చర్యగా రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం తాజా ప్రశ్నపత్రాలను సిద్ధం చేయనుంది. మార్చి 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. ఉద్యానవన శాఖలోని 22 హార్టికల్చర్ ఆఫీసర్, 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ పోస్టులకు ఏప్రిల్ 4, 23 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షలు జరగనున్నాయి.
ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా సబ్జెక్ట్ నిపుణులచే తాజా ప్రశ్నపత్రాలను తయారు చేస్తారు. ''రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం మేము తాజా ప్రశ్న పత్రాలను సిద్ధం చేస్తాము. రిక్రూట్‌మెంట్ పరీక్ష షెడ్యూల్ తాత్కాలికమే అయినప్పటికీ, పరీక్షలు ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి అభ్యర్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలి'' అని టీఎస్‌పీఎస్‌సీ వర్గాలు తెలిపాయి.
ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కారణంగా.. మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలోని 175 ఖాళీలకు, వెటర్నరీ, పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 185 ఖాళీలకు మార్చి 15, 16 తేదీల్లో జరగాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్షలను కమిషన్ ఇప్పటికే వాయిదా వేసింది.
గ్రూప్- I మెయిన్ ముందుగా ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూన్ 5 నుండి 12 వరకు నిర్వహించబడుతుంది. ఇప్పటివరకు ఈ పరీక్ష కోసం కమిషన్ ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేయలేదు. ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా గ్రూప్-1 మెయిన్ పరీక్షకు 25,050 మంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అయ్యారు. ''అసిస్టెంట్ ఇంజినీరింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినందున, పరీక్షల నిర్వహణపై కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది'' అని అధికార వర్గాలు తెలిపాయి.