అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుంది: మంత్రి కేటీఆర్‌

TS Minister ktr tweet on telangana per capita income. తెలంగాణ రాష్ట్ర వృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలపై

By అంజి  Published on  1 March 2022 5:57 PM IST
అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుంది: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర వృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలపై తెలంగాణ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కె.టి.రామారావు స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెలిగిపోతోందని, విజయపథంలో దూసుకుపోతోందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 2014 నుండి 2021 మధ్య కాలంలో 130 శాతం పెరిగిందని, అదే సమయంలో తలసరి ఆదాయం 125 శాతం పెరిగిందని మంత్రి ట్వీట్ చేశారు. జీఎస్‌డీపీ 2014లో రూ.5 లక్షల కోట్ల నుంచి 2021లో రూ.11.54 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం 2014లో రూ.1,24,104 నుంచి 2021లో రూ.2,78,833కి పెరిగింది.

దేశంలోనే అతి చిన్న వయస్సు గల తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను గురించి చెబుతూ ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన నివేదిక క్లిప్పింగ్‌ను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 'మీ అద్భుతమైన నాయకత్వానికి ధన్యవాదాలు కేసీఆర్‌' అని మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌కు జోడించారు. నివేదిక ప్రకారం, 2021-22 మధ్యకాలంలో తెలంగాణ జిఎస్‌డిపిలో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే జీఎస్‌డీపీ 19.10 శాతం పెరగగా, తలసరి ఆదాయం 18.78 శాతం పెరిగింది. 2022-23 బడ్జెట్‌కు ముందు తెలంగాణకు బూస్ట్‌గా ఈ వార్తల గణాంకాలు వచ్చాయి. మార్చి 7న ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


Next Story