మైనర్ అబార్షన్‌పై.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

TS High court passed a sensational verdict.తెలంగాణ హైకోర్టు ఓ అత్యాచార బాధితురాలి కేసులో సంచలన తీర్పు

By అంజి  Published on  8 Oct 2021 2:57 AM GMT
మైనర్ అబార్షన్‌పై.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు ఓ అత్యాచార బాధితురాలి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం ద్వారా బాధితురాలికి ఏర్పడిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే తమ మొదటి ప్రాధాన్యం అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. 16 సంవత్సరాల బాలికపై దగ్గరి బంధువైన ఆంజనేయులు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత విషయం తెలుసుకున్న తల్లి.. బాలికకు వైద్య పరీక్షలు చేయించింది. ఈ పరీక్షల్లో బాలిక గర్భవతిగా తేలింది. దీంతో బాలికకు అబార్షన్‌ చేసి గర్భాన్ని తొలగించాలని తల్లి వైద్యులను కోరింది. అందుకు వైద్యులు ఒప్పుకోకపోవడంతో తన తల్లి ద్వారా బాలిక హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఒక వైద్యుల కమిటీ నియమించి నివేదిక సమర్పించాలని ఆదేశం ఇచ్చింది. తదనంతరం బాలికకు వైద్య పరీక్షలు చేసి నివేదికను వైద్యుల కమిటీ హైకోర్టుకు సమర్పించింది.

ఈ నివేదికలో బాలిక గర్భం 25 వారాలుగా తేల్చిన వైద్యులు.. నిపుణుల ద్వారా గర్భాన్ని తొలగించవచ్చని సూచించారు. కేసులోని అన్ని విషయాలను పరిశీలించిన అనంతరం బాలికను గర్భాన్ని తొలగించేందుకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌ రెడ్డి అనుమతిస్తూ తీర్పు వెలువరించారు. బాలికకు అవాంఛిత గర్భాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పిండం నుంచి సేకరించే డీఎన్‌ఏను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని, వాటి నివేదికలను కేసు దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని తీర్పు వెలువరించింది. 24 వారాలకు మించి వయస్సు ఉన్న పిండం తొలగింపునకు ఆదేశాలు ఇచ్చే అధికారం చట్టప్రకారం కోర్టులకు ఉందని తెలిపారు. గర్భాన్ని ఉంచుకోవాలనే హక్కుతో పాటు.. వద్దనుకునే హక్కు కూడా చట్టపరిమితులకు లోబడి మహిళకు ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అవాంఛిత గర్భాన్ని తొలగించకపోతే ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని, ఆత్మగౌరవంతో, ఆరోగ్యంగా జీవించే హక్కు మహిళలకు ఉందని న్యాయస్థానం వ్యాఖ్యనించింది.

Next Story