క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
TS High Court orders government to impose restrictions on celebrations.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2021 6:15 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ రోజు రోజుకి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్(కొత్త సంవత్సరం) వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు గానీ ఇతర పండుగలకు జనం గుంపులు గుంపులుగా ఉండకుండా.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరే ఆంక్షలు విధించాలని సూచించింది. ఎయిర్‌పోర్టులో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పింది.
నిన్న ఒక్క రోజే 14 కేసులు..
రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 14 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 14 మందిలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు కాగా.. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు 12 మంది కావడం గమనార్హం. వీరిలో ముగ్గురు మహిళలు కాగా 11 మంది పురుషులున్నారు. ఈ కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 38కి చేరింది. మొత్తం 38 కేసుల్లో 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు కాగా.. ఆరుగురు రిస్క్ దేశాల నుంచి రాగా.. తొలిసారిగా ఒకరికి తెలంగాణలో ఒమిక్రాన్ సోకింది.