కడప ఎంపీ, వైసీపీ నేత అవినాశ్ రెడ్డికి మంగళవారం హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్ విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్ ఉండాలని స్పష్టం చేసింది. 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డి కూడా రోజూ విచారణకు హాజరు కావాలని, ఆ రోజున ఈ బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇస్తామని తెలిపింది. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు అవినాష్ రెడ్డి. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి నిన్న, ఈ రోజు వాదనలు విన్నారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఇప్పుడు అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
ఇక వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి సీబీఐ కోర్టు 6 రోజుల కస్టడీ విధించింది. వారిద్దరి కస్టడీకి సీబీఐకి అనుమతి ఇచ్చింది. వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి నెల రోజుల ముందు కుట్ర పన్నారని, అందుకోసం రూ.40 కోట్లను సిద్ధం చేసుకున్నారని, అందులో నాలుగైదు కోట్ల రూపాయలు చేతులు మారాయని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలిపారు.