తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు..!
TS Govt going to increase land registration charges.తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 21 Jan 2022 5:18 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని యోచినట్లు తెలుస్తోంది. ఇక పెంచిన కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. అంతేకాకుండా బహిరంగ మార్కెట్‌లో విలువలు భారీగా ఉన్న చోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేలా వారం రోజుల్లో పెంపు కార్యాచరణ వేగవంతం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది.
కాగా.. గత ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువతో పాటు 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం రూ.75 వేలుగా, తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ రేటును 50శాతం పెంచగా.. మధ్యశ్రేణి భూముల విలువను 40శాతం, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30శాతం మేర పెంచింది. ఖాళీ స్థలాల కనీస ధర చదరపు గజానికి రూ.200గా నిర్ణయించింది. వీటి విలువను కూడా 50శాతం, 40శాతం, 30 శాతంగా పెంచింది. సవరించిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు గత ఏడాది జులై 22 నుంచి అమలు లోకి వచ్చాయి.