తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి సెలవులు రద్దు..?

TS Govt cancels holidays to doctors and nurses.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త‌ రెండు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 7:56 AM GMT
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి సెలవులు రద్దు..?

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త‌ రెండు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగ‌ళ‌వారంతో పోలిస్తే బుధ‌వారం దాదాపు 50 శాతం అధికంగా కొత్త‌గా కేసులు న‌మోదు అయ్యాయి. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది. పైగా ఒమిక్రాన్ కేసులు కూడా పెద్ద సంఖ్య‌లో న‌మోదు అవుతుండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు, న‌ర్సుల సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. థ‌ర్డ్ వేవ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను సిద్దం చేయాలంటూ ఆస్ప‌త్రుల సూప‌రింటెండెంట్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 8 నుంచి విద్యాసంస్థ‌ల‌కు సెలవులు ఉన్న నేప‌థ్యంలో 15 నుంచి 18 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న విద్యార్థుల‌కు స్కూళ్ల‌లోనే వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ నెల 1 తేదీ నుంచి చూస్తే ఐదు రోజుల్లోనే దాదాపు ఐదు రెట్ల కేసులు పెరిగాయి. ఈ నెల 1న 317 మంది కరోనా బారినపడితే రెండో తేదీన 274, 3న 482, 4న ఏకంగా వెయ్యి కేసులు దాటాయి. ఇక నిన్న 1520 పైకి కేసులొచ్చాయి. పాజిటివిటీ రేట్‌ సైతం ఈ నెల 1న 1.10 శాతంగా ఉంటే.. ఐదు రోజులకే 3.57 శాతానికి పెరిగింది. యాక్టివ్‌ కేసులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. జనవరి 1న 3 వేల 733 యాక్టివ్ కేసులుంటే 3న 4 వేల 48 యాక్టివ్‌ కేసులున్నాయి. 4వ తేదీకి 4 వేల 858 క్రియాశీల కేసులుంటే.. 5వ తేదీకి 6 వేలు దాటేశాయి. ప్రస్తుతం తెలంగాణలో 6 వేల 168 యాక్టివ్‌ కేసులున్నాయి.

Next Story