సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా దబ్బీర్ పేటకు చెందిన దామెర రాకేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. రాకేష్ మరణంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. రాకేశ్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాకేశ్ కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు, దుర్మార్గ విధానాలకు వెనుకబడిన తరగతుల బిడ్డ బలికావడం తనను కలిచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు నర్సంపేట నియోజకవర్గ బంద్
రాకేశ్ మృతిని నిరసిస్తూ నేడు(శనివారం) నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాకేశ్ మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు వరంగల్ నుంచి ర్యాలీగా నర్సంపేటకు ఆయన మృతదేహాన్ని తీసుకువెళ్లనున్నారు. అనంతరం దబీర్‌పేటలో రాకేశ్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ముందస్తుచర్యల్లో భాగంగా ప్రస్తుతం రాకేశ్ మృతదేహం ఉన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.