బ్లాక్ ఫంగస్.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. మందులు కూడా

TS Government key decision on Black fungus. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ్లాక్ ఫంగ‌స్ ను నోటిఫియాబుల్ వ్యాధిగా ప్ర‌క‌టించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 11:06 AM IST
Black fungus

కరోనా నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో వ్యాధి భయపెడుతోంది. క‌రోనా నుంచి కోలుకున్న వారు మ్యుకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో దేశంలో చాలా చోట్ల కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ్లాక్ ఫంగ‌స్ ను నోటిఫియాబుల్ వ్యాధిగా ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో దీనికి సంబంధించిన కేసులు ఎక్క‌డ న‌మోదైనా త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వానికి స‌మాచారం అందించాల‌ని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రాంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రులన్నింటికీ ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి రోజు ఆయా ఆస్ప‌త్రుల్లో న‌మోదైన బ్లాక్ ఫంగ‌స్ అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న‌వారి వివ‌రాలు ఆరోగ్య శాఖ‌కు అందించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం వివ‌రించింది.

మందులు కావాలా? ఇలా చేయండి..

బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్సలోవాడే మందులకు డిమాండ్ పెరిగిపోతోంది. చాలా చోట్ల మందులు దొరకడం లేదు. రెమిడెసివిర్‌ను బ్లాక్ మార్కెట్ చేసినట్లుగానే బ్లాక్ ఫంగస్ మందులను కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ వివరాలను తాము పేర్కొన్న ఫార్మట్‌లో వివరాలను పంపిస్తే ప్రభుత్వమే మందులను అందజేస్తుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

బ్లాక్‌ ఫంగస్ మందులు కావాల్సిన వారు dme@telangana.Gov.in మరియు ent-mcrm@telangana.Gov.inకు పూర్తి వివరాలతో మెయిల్ చేయాలి. పేషెంట్‌తో పాటు చికిత్స పొందుతున్న ఆస్పత్రి, ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అప్లికేషన్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి DMETELANGANA, KTRofficeకు ట్యాగ్ చేస్తే వారు ఫాలోఅప్ చేస్తారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి.. నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వమే వారికి మందులను పంపిణీ చేస్తుంది.


Next Story