వరద ప్రభావిత ప్రాంతాలపై టీఎస్ డీపీహెచ్‌వో సమీక్ష
TS director of public health reviews flood-hit areas in 8 districts. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వరద
By అంజి Published on 19 July 2022 8:35 PM ISTగత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు మంగళవారం సమీక్షించారు. సమీక్షించిన జిల్లాల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, ములుగు, నిర్మల్, పెద్దపల్లి ఉన్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాలను నాలుగు భౌగోళిక ప్రాంతాలుగా విభజించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యకలాపాలను వేగవంతం చేయాలని, వెక్టార్ నియంత్రణ చర్యలు, మందుల నిల్వలను ఉంచాలని ఆదేశించారు.
ఇంటింటికి వెళ్లి జ్వరాలపై సర్వే కూడా ప్రారంభించినట్లు డీపీహెచ్‌వో తెలిపారు. అలాగే 297 హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.ఇప్పటికే ఉన్న సిబ్బందితో పాటు మొత్తం 670 మంది ఆరోగ్య అధికారులను వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మొత్తం 368 ఆరోగ్య శిబిరాలు నిర్వహించగా 18,558 మందికి చికిత్స అందించారు. దీనితో 16 జూలై 2022 నుండి చికిత్స పొందిన వారి సంఖ్య 64,230కి చేరుకుంది.
మూడవ రోజు పర్యటనలో భాగంగా ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి.. గోదావరి నది ఒడ్డున తీవ్రంగా ప్రభావితమైన గ్రామాలలో ఒకటైన దమ్ముగూడెం పిహెచ్‌సిలోని ఎం కాశీనగర్ ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంపీ బంజారా పీహెచ్‌సీలోని స్టెల్లా మారిస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ హెల్త్ క్యాంపును సందర్శించి ముంపు ప్రాంతంలో రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను సమీక్షించారు.