సెప్టెంబర్‌ 3న టీఎస్‌ కేబినెట్‌ భేటీ.. అదే రోజు టీఆర్‌ఎల్పీ సమావేశం కూడా..

TS Cabinet meeting on September 3. TRSLP meeting on the same day... సెప్టెంబర్‌ 3న తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని

By అంజి  Published on  30 Aug 2022 7:40 AM GMT
సెప్టెంబర్‌ 3న టీఎస్‌ కేబినెట్‌ భేటీ.. అదే రోజు టీఆర్‌ఎల్పీ సమావేశం కూడా..

సెప్టెంబర్‌ 3న తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల నిర్వహణపై కేసీఆర్‌ మంత్రి వర్గం ఓ నిర్ణయానికి రానుంది.

ఇక అదే రోజు కేబినెట్‌ భేటీ అనంతరం టీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ జరుగనున్నది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు సైతం పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, ప్రస్తుత రాజకీయాలు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక రేపు గాల్వాన్ లోయలో ప్రాణాలు అర్పించిన భారత జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీహార్‌లో పర్యటించనున్నారు. వ్యవసాయ చట్టాల ఆందోళనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన రైతులకు, గాల్వాన్ వ్యాలీలో తమ ప్రాణాలను బలిగొన్న సైనికులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేయ‌నున్న‌ట్లు ఓ ప్రకటన తెలిపారు. కేసీఆర్‌ బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి పాట్నా వెళ్లనున్నారు. బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌తో కలిసి అమ‌రులైన‌ సైనికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్‌ కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందించనున్నారు.

Next Story