తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. నల్లగొండ, మెదక్, ఖమ్మం స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
నల్లగొండ..
గులాబీ పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది. నల్లగొండలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 ఓట్లు చెల్లనివి. ఇక్కడ గెలిచేందుకు 593 ఓట్లు అవసరం కాగా.. కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి విజయం సాధించారు.
ఖమ్మం..
టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపొందారు. ఇక్కడ 12 చెల్లని ఓట్లు నమోదు అయ్యాయి. మిగతా వాటిలో టీఆర్‌ఎస్‌కు 480, కాంగ్రెస్‌కు 242 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మెదక్..
టీఆర్‌ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి ఘన విజయం సాధించారు. యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. ఇక్కడ 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.