జాతీయ రహదారులపై టీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో.. కేంద్రం ధాన్యాన్ని కొనాల్సిందే
TRS Protest Against Centre over Paddy Procurement Issue.తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించే ధాన్యాన్ని కేంద్ర
By తోట వంశీ కుమార్ Published on 6 April 2022 6:29 AM GMTతెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రాష్ట్రంలోని జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు జాతీయ రహదారులపై బైఠాయించారు. సూర్యాపేట జిల్లాలో జగదీశ్‌రెడ్డి, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్ వద్ద ఇంద్రకరణ్‌రెడ్డి లతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, తదితరులు రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వరి వేయండని, మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయకులు చెప్పారన్నారు. తీరా పంట చేతికి వచ్చాకా మోహం చాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల తరపున టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ సర్కార్ బుద్ధి తెచ్చుకుని కళ్లు తెరవాలని సూచించారు
టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసనలతో హైవేలపై ట్రాఫిక్ సంభించింది. దీంతో పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. వాహన రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ఇప్పటికే టీఆర్ఎస్ ఐదు అంచెల పోరాట కార్యక్రమాలకు సిద్దమైంది. అందులో భాగంగా తొలి అంచెలో నాలుగో తేదీన మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.