ప్రభుత్వ అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో

TRS MLA Krishna Mohan reddy fires on officials in Gadwal district. హైదరాబాద్: తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే తాను రాకముందే పాఠశాలను

By అంజి
Published on : 23 Nov 2022 12:10 PM IST

ప్రభుత్వ అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో

హైదరాబాద్: తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే తాను రాకముందే పాఠశాలను ప్రారంభించారని ఆగ్రహంతో ప్రభుత్వ అధికారి కాలర్‌ పట్టుకున్నాడు. సాంఘిక సంక్షేమ శాఖ నూతనంగా నిర్మించిన గురుకులాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ప్రారంభించడంపై గద్వాల శాసన సభ సభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది.

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత తన హాజరు లేకుండా ప్రారంభోత్సవం నిర్వహించడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ అధికారి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అకస్మాత్తుగా ఆయన వద్దకు వెళ్లి కాలర్ పట్టుకుని తోసేశారు. ఈ ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. జిల్లా స్థాయి అధికారితో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడంపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

"పాఠశాలను ఎవరు ప్రారంభిస్తారన్నది ముఖ్యం కాదు" అని అధికారి వ్యాఖ్యానించడంతో తనకు కోపం వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఘటనతో జిల్లా టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు కూడా తెరపైకి వచ్చింది. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగానే ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అయితే అధికార పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలతో తమపై ఇలా ప్రవర్తించడం ఏంటని అధికారులు వాపోతున్నారు.

Next Story