టీఆర్‌ఎస్‌.. ఇక నుంచి బీఆర్‌ఎస్‌

TRS Is Bharat Rashtra Samithi Says ECI. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం

By అంజి  Published on  8 Dec 2022 6:46 PM IST
టీఆర్‌ఎస్‌.. ఇక నుంచి బీఆర్‌ఎస్‌

తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాలని ఈ సంవత్సరం దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌ రాసిన లేఖపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈసీ ఆమోద ముద్ర వేసింది. పార్టీ పేరు మార్పున‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ పంపింది. దీంతో పార్టీ నాయ‌కులు, కార్యకర్తలు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సంవత్సరం అక్టోబ‌ర్ 5న‌ ద‌స‌రా పండుగ రోజున టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా కేసీఆర్ ప్ర‌క‌టించారు. దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తికై సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించి ఈసీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా కేసీఆర్ అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. అదే రోజు నిర్వహించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు. జెడి (ఎస్) నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి తన పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలతో పాటు దళిత నాయకుడు తిరుమావళవన్‌తో సహా తమిళనాడులోని విడుతలై చిరుతైగల్ కచ్చి (విసికె)కి చెందిన ఇద్దరు ఎంపీలు ఆ రోజు వచ్చారు.

తాజాగా, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చుతూ అధికారికంగా ఈసీ క్లియరెన్స్ ఇచ్చేసింది. దీంతో 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. ఈసీ లేఖపై ముఖ్యమంత్రి సంతకం చేసి శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ పంపారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ పేరు తనదేనంటూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బానోతు ప్రేమ్ గాంధీ అనే యువకుడు బీఆర్ఎస్ పేరును తనకే కేటాయించాలని కోరాడు. తాను బీఆర్ఎస్ పేరును కోరుతూ సెప్టెంబరు 5నే దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించాడు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రేమ్‌గాంధీ దరఖాస్తును లెక్కలోకి తీసుకుని ఈసీ.. తన తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.

Next Story