స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. టీఆర్ఎస్‌ క్లీన్‌స్వీప్

TRS Clean Sweep in MLC Elections.తెలంగాణ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2021 5:21 AM GMT
స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. టీఆర్ఎస్‌ క్లీన్‌స్వీప్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించారు. మొత్తం 12 స్థానాల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా.. నాలుగు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలోని ఆరు స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు స్థానాల్లో(కరీంన‌గర్‌ జిల్లాలో రెండు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో) శుక్ర‌వారం(డిసెంబ‌ర్ 10న‌) పోలింగ్‌ను నిర్వ‌హించారు. ఈ ఓట్ల లెక్కింపును మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌లకు చేప‌ట్టారు. ఓట్లు త‌క్కువ‌గానే ఉండ‌డంతో రెండు గంట‌ల్లోనే విజేత ఎవ‌రో తేలిపోయింది.

ఇప్పటికే ఆరు స్థానాలను ఏకగ్రీవం ద్వారా తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్‌ పార్టీ.. పోలింగ్‌ జరిగిన స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటింది. కరీంనగర్‌ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్. ర‌మ‌ణ‌, భానుప్రసాద్ రావు, ఖ‌మ్మం జిల్లాలో తాత మధుసూదన్, ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠ‌ల్, మెద‌క్ జిల్లాలో యాద‌వ‌రెడ్డి, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.

న‌ల్ల‌గొండ‌..

గులాబీ పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది. నల్లగొండలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 ఓట్లు చెల్లనివి. ఇక్కడ గెలిచేందుకు 593 ఓట్లు అవ‌స‌రం కాగా.. కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు మాత్ర‌మే వచ్చాయి. దీంతో 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి విజయం సాధించారు.

ఖ‌మ్మం..

టీఆర్ఎస్ అభ్య‌ర్థి తాత మధు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపొందారు. ఇక్క‌డ‌ 12 చెల్లని ఓట్లు న‌మోదు అయ్యాయి. మిగతా వాటిలో టీఆర్‌ఎస్‌కు 480, కాంగ్రెస్‌కు 242 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు మాత్ర‌మే వచ్చాయి.

మెద‌క్‌..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డికి ఘ‌న విజయం సాధించారు. యాదవరెడ్డికి 762 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. ఇక్కడ 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.

కరీంనగర్..

క‌రీంన‌గ‌ర్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు విజయం సాధించారు. భాను ప్రసాదరావుకు 500 ఓట్లు రాగా, ఎల్ రమణకు 450 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్‌కు 232 ఓట్లు వచ్చాయి.

ఆదిలాబాద్‌..

ఇక్క‌డ కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 72 ఓట్లు వచ్చాయి.

Next Story