పేరు మార్చుకున్నంత మాత్రాన.. టీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారదు: ఖర్గే

TRS cannot become national party by just changing name, says Kharge. తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్ ) పేరు మార్చుకున్నంత మాత్రాన జాతీయ పార్టీగా మారదని కాంగ్రెస్ సీనియర్ నేత

By అంజి  Published on  9 Oct 2022 7:14 AM GMT
పేరు మార్చుకున్నంత మాత్రాన.. టీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారదు: ఖర్గే

తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్ ) పేరు మార్చుకున్నంత మాత్రాన జాతీయ పార్టీగా మారదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు . కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీదారు ఖర్గే మాట్లాడుతూ.. గతంలో అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి వెళ్లేందుకు తమ పేర్లను మార్చుకున్నాయని, అయితే ఏమీ జరగలేదన్నారు. అన్నాడీఎంకే ఏఐఏడీఎంకేగా, టీఎంసీ ఆల్ ఇండియా టీఎంసీగా మారాయన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్‌ నగరానికి వచ్చిన ఖర్గే ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను అపహాస్యం చేసినందుకు బీజేపీ నేతలపై కూడా ఆయన ఎదురుదాడికి దిగారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్యానించారు. బిజెపి ఎన్నడూ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించలేదని ఖర్గే ఆరోపించారు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా తదితరులు ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారా? అని ఆయన ప్రశ్నించారు. తనకు, శశిథరూర్‌కు మధ్య పోటీ జరగడం పార్టీ అంతర్గత వ్యవహారమని ఖర్గే పేర్కొన్నారు. నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం అన్ని రంగాల్లో పతనమైందని ఖర్గే ఆరోపించారు. మోదీ, షా బృందం దేశాన్ని నాశనం చేసిందని ఆయన అన్నారు.

70 ఏళ్లలో ఏం చేశామని పదే పదే అడిగేవారని.. ఆనకట్టలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టామని.. మేం పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించామని, వాటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ హయాంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. కోవిడ్ తర్వాత కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 82.32కి పడిపోయిందన్నారు.

మోదీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని కాంగ్రెస్ నేత అన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.416 ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100కి చేరింది. పాలు, పెన్సిల్, రబ్బరు వంటి వాటిపై కూడా జీఎస్టీ విధించడం ద్వారా మోదీ ప్రభుత్వం సామాన్యులపై భారాన్ని మరింత పెంచిందని ఖర్గే అన్నారు.

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు అక్టోబర్ 19న వెల్లడికానున్నాయి.

Next Story
Share it