హైదరాబాద్: సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసింది. జనవరి 7 నుండి ఈ రోజు వరకు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో 219 పైవేట్ ట్రావెల్స్ బస్సులపై పై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. సరుకు రవాణా చేయడం, ప్రయాణీకుల జాబితా లేక పోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని రవాణా శాఖ తెలిపింది. సంక్రాంతి రద్దీ నేపథ్యం లో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితులలో అధిక ఛార్జీలు వసూలు చేయరాదని, స్టేజ్ క్యారేజ్ గా బస్సులు తిప్పరాదని రవాణా శాఖ హెచ్చరించింది. త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణ పై మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయ్యి తెలంగాణ లో తిరిగే స్లీపర్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్దం గా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ తెలిపింది