హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లేవారికి అలర్ట్.. సూర్యాపేట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
Traffic diversions on Hyderabad-Vijayawada NH 65 from Feb 5.హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు
By తోట వంశీ కుమార్ Published on 4 Feb 2023 9:10 AM ISTపెద్దగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండవ పెద్ద జాతర. దీనినే లింగమంతుల స్వామి జాతర అని పిలుస్తారు. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో ఈ నెల 5 నుంచి 9 వరకు జాతర జరగనుంది. నేషనల్ హైవే 65 కు అత్యంత సమీపంలో జాతర జరగనుండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణీకులు, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
- హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365-బీ మీదుగా మళ్లిస్తారు. రాఘవాపురం స్టేజీ నుంచి నామవరం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపు పంపిస్తారు.
-హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలు, ట్రాన్స్‌పోర్టు వాహనాలను టేకుమట్ల నుంచి జాతీయ రహదారి 365-బీ మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడ వైపు మళ్లిస్తారు.
- విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను జాతీయ రహదారి 65పై స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డు మీదుగా ఖమ్మం జాతీయ రహదారి 365-బీ రోళ్లబండతండా వరకు మళ్లించి జాతీయ రహదారి రాయనిగూడెం వద్ద యూటర్న్ చేసి హైదరాబాద్ వైపు పంపిస్తారు.
- విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు, ట్రాన్స్‌పోర్టు వాహనాలను కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లిస్తారు.
- కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలను ఎస్సారెస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం మీదుగా సూర్యాపేట పట్టణానికి పంపిస్తారు.
- సూర్యాపేట పట్టణం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రజా రవాణా వాహనాలను కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం, రాఘవాపురం స్టేజీ, నామవరం మీదుగా గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపు పంపిస్తారు.
ఆదివారం తెల్లవారుజాము నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
జాతరకు సర్వం సిద్దం
ఈ సారి జాతరకు దాదాపు 15లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు అన్ని దాదాపుగా పూర్తి చేశారు.పెద్దగట్టు జాతరకు ప్రభుత్వం రూ. 6.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు, చేజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పించారు. ఐదు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. జాతర భద్రత కోసం 1850 మంది పోలీసులు విధుల్లో నిమగ్నం కానున్నారు. 500 మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నారు. 60 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దగట్టు చెరువు చుట్టూ ప్రమాదాలు జరగకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు.