డేట్ చెప్పిన రేవంత్‌.. ఆరోజు నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంటది..!

TPCC President Revanth Reddy Kodangal Visit. మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  27 Jan 2023 5:33 PM IST
డేట్ చెప్పిన రేవంత్‌.. ఆరోజు నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంటది..!

మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మద్దూరులో ఆయ‌న మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలేన‌ని.. వారి పాలనలో మహిళలకు, మైనారిటీలకు రక్షణ లేదని అన్నారు. ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అని కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. మాయమాటలు చెప్పి రెండు సార్లు ప్రజలను మోసం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి బొందలగడ్డ తెలంగాణ చేశార‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, అరణ్య రోదనలే వినిపిస్తున్నాయ‌ని అన్నారు.

రాహుల్ గాంధీది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. ప్రాణాలకు తెగించి దేశ భవిష్యత్తు కోసం రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. కృష్ణా నదిపై రాహుల్ పాదయాత్రకు పాలమూరు బిడ్డలు స్వాగతం పలికారు. రాహుల్ పాదయాత్ర ముగియడంతో మన బాధ్యత తీరలేదు. హాత్ సే హాత్ జోడో యాత్ర తో రాహుల్ సందేశాన్ని ప్రతీ ఇంటికి, ప్రతీ గుండెకు చేరవేయాలని పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 6 నుంచి పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర నలుమూలల పర్యటించడానికి సోనియా గాంధీ, ఖర్గే నాకు ఆదేశాలు ఇచ్చారు. మీ ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రకు వెళ్లడానికే ఇక్కడకు వచ్చాన‌ని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ ఇవ్వలేదు. మ‌న‌కెందుకు కృష్ణా నీళ్లు, రైల్వే లైను, జూనియర్ కాలేజీ రాలేదు. టీఆర్ఎస్ కు ఓటు వేయడమే ఇక్కడి ప్రజలు చేసిన తప్పా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ను గెలిపించుకుందాం.. కొడంగల్ ను అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ చేసుకుందాం. కొడంగల్ కు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం అని అన్నారు.

నూరు గ్రామాలు కాదు.. నూరు నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావలని మా కార్యకర్తలు తీర్మానించారని అన్నారు. 2024 జనవరి 1 నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంటది. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు. ఇంతకాలం మంచిగా ఉన్నాం.. మరీ అన్యాయంగా వ్యవహరిస్తే అన్నీ గుర్తుపెట్టుకుంటాం అని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.



Next Story