కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వ‌చ్చింది : రేవంత్

కేసీఆర్, హరీష్, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

By Medi Samrat  Published on  17 Oct 2023 10:30 AM GMT
కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వ‌చ్చింది : రేవంత్

కేసీఆర్, హరీష్, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని వాళ్లు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారు. బీజేపీ, బీఆరెస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి. నెలరోజుల్లో 60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో 300 కోట్ల మద్యం అమ్మారు. మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, డబ్బు పంచలేదని అన్నారు. దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారని గుర్తు చేశారు. మునుగొడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగిందని అన్నారు.

అందుకే మాపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసిరా.. చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరాన‌ని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుంది. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించా.. కేసీఆర్ రాకపోగా.. అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అరెస్టు చేస్తారా? అని నిప్పులు చెరిగారు. ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారని.. మా కార్యకర్తలపై దాడులు చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రజలు కోరింది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ తన కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు. మేం విసిరిన సవాల్ స్వీకరించకపోవడంతో.. కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చిందన్నారు.

నిన్న గన్ పార్క్ వద్ద నిరసనలు చేసినవారికి నిబంధనలు వర్తించవా? కాంగ్రెస్ ను తిట్టి ధర్నా చేసే వారికి రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదా? అని ప్ర‌శ్నించారు. మేం ఇచ్చిన హామీలను అన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారని.. మరి మేం 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం.. కాని కేసీఆర్ ఉద్యోగ నియామకాల ఊసే ఎత్తలేదన్నారు. కేసీఆర్ దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నార‌ని.. నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి.. ఈ 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకులు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుందని.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌ని తెలిపారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని దర్శించుకుంటారని తెలిపారు. ఆరు గ్యారంటీలను శివుడి ముండు పెట్టి భక్తితో పూజిస్తారని వెల్ల‌డించారు. శివుడిపై నాకూ విశ్వాసం ఉంది. శివుడిని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడతామ‌న్నారు. మొదటిరోజు ములుగు, భూపాలపల్లి పరిధిలో మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామ‌ని.. రెండో రోజు కరీంనగర్ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర ఉంటుందని వివ‌రించారు.

Next Story