పదేళ్లు గడిచినా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెన్షన్ దారులకు డబ్బులు ఎప్పుడు పడుతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు.. పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని.. కిరాయి మనుషులతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని.. స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు విషయం బయటపడిందన్నారు.
సీఎం కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా.. మా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు మీరు సిద్ధమా.?.. బస్సు సిద్ధంగా ఉంది.. గజ్వేల్ ఫామ్ హౌస్‌కు రావాలా.. ప్రగతి భవన్ కు రావాలో చెప్పండన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకుని అటునుంచి కర్ణాటక వెళదామన్నారు. ఈ సవాలుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని కోరారు.