కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శ్రేణులకు సూచించారు. ఆయన అధ్యక్షతన గాంధీభవన్ లో కులగణపపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలని సూచించారు.
రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుల గణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కులగణనపై సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనికి పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నవంబర్ 2న 33 జిల్లాల్లో కులగణనపై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణనపై ఎలాంటి అనుమానాలు ఉన్నా గాంధీభవన్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామన్నారు.