ఒక్కరోజు నిద్రతో ఏం సాధించారు.. కిషన్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప్ర‌శ్న‌లు

మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

By Kalasani Durgapraveen  Published on  17 Nov 2024 5:15 PM IST
ఒక్కరోజు నిద్రతో ఏం సాధించారు.. కిషన్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప్ర‌శ్న‌లు

మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారని.. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారన్నారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయన్నారు. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం సవాల్ విసిరారు. నేను కూడా వస్తాను. మీరు నేను ఇద్దరం కలసి మూడు నెలలు అక్కడ బస చేద్దాం రండి అని స‌వాల్ విసిరారు. అక్క‌డి ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారని అన్నారు.

BRS గ్రాఫ్ పడిన ప్రతీ సారి కిషన్ రెడ్డి బయటకి వస్తాడన్నారు. BRS ను ప్రొటెక్ట్ చేయడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని.. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారని ప్ర‌శ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అందుకు అడ్డుపడుతున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కి ఒక న్యాయం.. మూసీ రివర్ కి ఒక న్యాయమా..? అని నిల‌దీశారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకున్నాం.. వారి పిల్లలకు విద్య అవకాశాలు కల్పిస్తున్నామ‌న్నారు. గుజరాత్ గులాం లా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్ర‌శ్నించారు.

ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుంది అనగానే.. వీళ్లకు భయం పట్టుకుంది.. గుజరాత్ ను ఎక్కడ తెలంగాణ వెనక వేస్తుందో అన్న భయం బీజేపీని వెంటాడుతుందన్నారు. ప్రళయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.. ఒక్కరోజు నిద్రతో అక్కడి ప్రజల అవస్థలు ఏం తెలుసుకున్నారో చెప్పండని ప్ర‌శ్నించారు. DPR వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టలో తెలుస్తుందన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే భాధ్యత మా ప్రభుత్వం ది. పదేళ్లు తెలంగాణ అభివృద్ధి కుంటు పడిందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ మార్పు చూస్తారు. తెలంగాణ రైజింగ్ గా ముందుకు వెళ్తుందన్నారు.

మూసీ ప్రక్షాళన చేసి తీరుతామ‌న్నారు. కిషన్ రెడ్డి కాళ్ళకు సాక్సులు వేసుకొని నిద్రపోయారు.. అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుంది.. బీజేపీ, BRS ఎవరికి ఆపద వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం ఆదుకుంటార‌న్నారు. బుల్డోజర్ పాలన మాది కాదు.. యోగి అధిత్యనాథ్ ది బుల్డోజర్ పాలన అన్నారు. నిజాం కాలంలో మూసీ బోర్డు కూడా ఉండేదని గుర్తుచేశారు. లగచర్ల దాడిలో కేటీఆర్ ఉన్నాడని స్పష్టమైంది.. కాబట్టే డైవర్ట్ చెయ్యడానికి కిషన్ రెడ్డి బస చేస్తున్నారని అన్నారు. మేము అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే.. నువ్వు అక్కడ ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి అని ప్ర‌శ్నించారు.

Next Story