కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం : టీపీసీసీ చీఫ్‌

ప్రతిపక్ష నేతల కుట్రలను తిప్పికొడుతూ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

By Kalasani Durgapraveen  Published on  9 Dec 2024 12:59 PM IST
కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం : టీపీసీసీ చీఫ్‌

ప్రతిపక్ష నేతల కుట్రలను తిప్పికొడుతూ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో రెండు పండగలు జరుపుకుంటున్నామని.. ఓ వైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘ప్రజాపాలన విజయోత్సవాలు’.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదిన ఉత్సవాలు మరోవైపు జరుపుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహేష్ గౌడ్ సోమవారం శాసన మండలిలో మీడియాతో మాట్లాడారు. మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా పాలనా విజయోత్సవాలు పండగ, తెలంగాణ ప్రజల పండగని.. ఈ ఉత్సవాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందిందని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్ వెంట ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, తీన్మార్ మల్లన్న ఉన్నారు.

తెలంగాణ పునర్వికాసం వైపు..

కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పునర్వికాసం వైపు పయనిస్తోందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకి చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని.. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని.. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ హయంలో పదేళ్ల పాలన గడీలకు, ఫామ్‌హౌస్‌లకే పరిమితమైందని.. కాంగ్రెస్ ఏడాది పాలన ప్రజలకు పాలన చేరువయ్యేలా..ప్రజాస్వామ్య పంథాలో నడుస్తోందని మహేష్ గౌడ్ వెల్లడించారు.

అంతకుముందు గాంధీ భవన్ సోనియాగాంధీ 79 వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఏఐసీసీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భారీ కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Next Story