కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి చేరింది. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలకు రేవంత్ వివరణ ఇచ్చుకున్నారు. తాను వెంకట్‌రెడ్డిని ఏమీ అనలేదన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని రేవంత్ తెలిపారు.
వెంకట్‌రెడ్డి తమ కుటుంబ సభ్యుడని, రాజగోపాల్ రెడ్డి ద్రోహి అని, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని రేవంత్ ఆరోపించారు. రాజగోపాల్ చెప్పుకునే బ్రాండ్ ఇచ్చింది కాంగ్రెస్సేనన్నారు. కాంగ్రెస్ లేకుంటే రాజగోపాల్ బ్రాందీ షాపులో పనిచేయడానికి కూడా పనికి రారని విమర్శించారు. తాను వెంకట్‌రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనకంటే వెంకట్‌రెడ్డి పార్టీలో సీనియర్ అని, తమ మధ్య కొందరు తగాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వేర్వేరన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడారని గుర్తు చేశారు. తన వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినవి మాత్రమే అని రేవంత్ వివరణ ఇచ్చారు. తన మాటలతో వెంకటరెడ్డి మనస్తాపం చెంది ఉంటే అందులో ఆయన ప్రస్తావన లేదని గుర్తించాలని కోరారు. మునుగోడు బై ఎలక్షన్‌లో తమతో కలిసి రావాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కోసం వెంకటరెడ్డి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.