సమ్మక్క సారక్క లపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో భక్తులు తీవ్ర విమర్శలు గుప్తిస్తుండగా.. పలువురు నేతలు మండితున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చినజీయర్‌కు సీఎం కేసీఆర్ గతంలో సాష్టాంగ నమస్కారం చేసిన ఫొటోను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. 'తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన "సమ్మక్క సారలమ్మ"లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి.. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని' రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.