హైదరాబాద్: రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై మాట్లాడాలన్నారు. లిక్కర్ వ్యాపారం చేసిన కవిత.. రాహుల్ పై మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
'కవిత వాళ్ల నాన్న, అన్న హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా ఇచ్చారు. ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా వాటి లెక్కలు బయటకు తీయాలి. లిక్కర్ వ్యాపారం చేసి ఆమె.. దేశం కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని విమర్శిస్తే ప్రజలు హర్షించరు' అని మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వస్తున్న రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ ట్వీట్ చేశారు. 'దారితప్పి వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం. అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను ముంచారు. మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటి? మీ సీఎం మానవ హక్కులను మంటకలుపుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? లాఠీ దెబ్బలు తిన్న హెచ్‌సీయూ విద్యార్థులను పరామర్శించండి' అని పేర్కొన్నారు.