హైదరాబాద్: డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్‌లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు మహేష్ గౌడ్ స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకుని సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు.
రాష్ట్రంలో జరుగుతున్న ‘ఓట్ చోర్’ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న ‘ఓట్ చోర్ మహా ధర్నా’ విజయవంతం అయ్యేలా అన్ని రంగాల నేతలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలపర్చే అభ్యర్థుల గెలుపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొత్త డీసీసీ అధ్యక్షులు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన ఆరు నెలల పనితీరు డెడ్‌లైన్ గురించి మరువకూడదని.. ఆ గడువులోపు స్పష్టమైన పురోగతిని చూపించాలని టీపీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, సమన్వయంతో పని చేస్తేనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు ఖాయం అవుతాయని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.