కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం కనిపించింది. లోయర్ మానేరు డ్యాంలోని బ్యాక్‌వాటర్‌లో సుడిగాలిలో నీరు చిక్కుకొని ఆకాశంలోకి ఎగిసింది. ఇలాంటి టోర్నడోలు ఎక్కువగా పశ్చిమ దేశాల్లో కనిపిస్తుంటాయి. తిమ్మాపూర్ మండలంలోని వచ్చునూర్ గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యామ్‌లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడున్న కొంతమంది తమ ఫోన్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టోర్నడోను చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. విదేశాల్లో వచ్చే టోర్నడోలు బీభత్సం సృష్టిస్తాయి. కొన్నిసార్లైతే టోర్నడో దెబ్బకు గ్రామాలు కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయి. అయితే కరీంనగర్ వచ్చిన టోర్నడో మాత్రం చాలా చిన్నదే అని చెప్పవచ్చు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు ఆందోళన చెందగా, మరికొందరు ఆస్వాదించారు. ఒక అర్థగంట పాటు నీరు సుడిగాలిలో చిక్కుకొని ఆకాశంలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.