మైనార్టీల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అర్హులైన మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం కేసీఆర్ కానుక పథం తీసుకొచ్చింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు రేపటి (జూలై 20)తో ముగియనుంది. అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టు మిషన్లను అందజేయనున్నట్టు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిపింది. క్రిస్టియన్ మైనార్టీ మహిళలకు 2 వేలు, ఇతర మైనార్టీ మహిళలకు 18 వేల కుట్టు మిషన్లను అందించనుంది. 21 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు.
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం, తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేద మైనార్టీ మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతల పత్రాలు, పాస్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయం అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఒంటరి, వితంతు, విడాకులు పొందిన, నిరుపేద మహిళలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఈ పథకానికి ఎంపికైన వారికి శిక్షణ ఇప్పించటంతో పాటు, కుట్టుమిషన్లను ఉచితంగా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ తెలిపారు.