రుచికరమైన వంటలు వండాలంటే తప్పనిసరిగా ఉల్లిపాయ, టమాటా ఉండాల్సిందే. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా.. రుచి తగ్గడం ఖాయం. అందుకనే ఉల్లి, టమాటాకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే..టమాటా కొనాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. మూడు నెలల కిందట కిలో టమాటా 5 నుంచి 8 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం పలు మార్కెట్లలో సెంచరీ కొట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో పంటలు దెబ్బతినడమే ఇందుకు కారణం.
సోమవారం మంచిర్యాల మార్కెట్‌లో కిలో టమాటా రూ.100కు విక్రయించారు. 20 కిలోల టమాటా బాక్సు రూ.1600 ధర పలికింది. ఇక రాష్ట్రంలో రైతు బజార్లు, పెద్దపెద్ద మార్కెట్లలో కిలో 80 పలుకుతుంటే చిన్న చిన్న మార్కెట్లో 130 రూపాయలకు వరకు చేరింది. ఇక ఎండల తీవ్రతకు రెండు, మూడు కిలోల వరకు పాడైపోతున్నాయని కూరగాయల వ్యాపారులు వాపోతున్నారు. దీంతో కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. కొత్త పంట చేతికొచ్చే వరకు టమాటా ధరలు పెరుగుదల ఆగేలా కనిపించడం లేదని అంటున్నారు. ధరలు ఈ స్థాయిలో మండిపోతుండడంతో కొనేదెట్టా అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో దాని వైపు చూసేందుకే గృహిణులు ఇష్ట పడటం లేదు.