చివరి అంకానికి చేరుకున్న వేడుకలు..ఇవాళ లాల్ దర్వాజ మహంకాళి బోనాలు
హైదరాబాద్‌లో నేడు లాల్ దర్వాజ మహంకాళి బోనాల వేడుకలు జరగనున్నాయి.
By Knakam Karthik
చివరి అంకానికి చేరుకున్న వేడుకలు..ఇవాళ లాల్ దర్వాజ మహంకాళి బోనాలు
హైదరాబాద్‌లో నేడు లాల్ దర్వాజ మహంకాళి బోనాల వేడుకలు జరగనున్నాయి. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనంతో మొదలైన బోనాలు ఈ లాల్ దర్వాజ బోనాలతో చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు, రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు, ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్‌దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు జరిగే లాల్‌దర్వాజ బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రేపు అమ్మవారి భవిష్యవాణి చెప్పే సాంప్రదాయ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఒక మహిళ మట్టికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. సోమవారం సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్, ఢిల్లీ దర్వాజ వరకు ఘటాల ఊరేగింపు, పోతరాజు విన్యాసాలు జరగనున్నాయి. ఇవి కనులపండుగగా సాగుతాయి. అందుకే ప్రభుత్వం రేపు అధికారిక సెలవు ఇచ్చింది. సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడతాయి. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు.
నేడు లిక్కర్ షాపులు మూసివేత
బోనాల పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా పబ్బులు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలో సైతం మద్యం సరఫరాను ఆ ఒక్కరోజు నిలిపివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం, కల్లు విక్రయాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.