నేడు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్ష జరగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,601 కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేశారు. పోలీస్‌శాఖలోని మొత్తం 15,644 కానిస్టేబుల్, రవాణాశాఖలోని 63, ఎక్సైజ్‌శాఖలోని 614 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షకు కలిపి 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. పరీక్ష కేంద్రంలోకి పర్మిషన్ ఉండదని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే తెలిపింది.
కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులను గుర్తించేందుకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోనున్నారు. ఇందుకోసం పరీక్షా సమయానికి కంటే గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. చేతులకు గోరింటాకు, మెహందీ వంటివి పెట్టుకుంటే బయోమెట్రిక్‌లో వేలిముద్రలు గుర్తించే ఛాన్స్ ఉండదని తెలిపారు. పరీక్ష హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. కాగా ఇప్పటికే కానిస్టేబుల్ అభ్యర్థులు తమ తమ ఎగ్జామ్ సెంటర్ల బాట పట్టారు.