సిద్ధిపేట జిల్లాలో పులి భయం..ఆ గ్రామ పొలిమేరల్లో పాదముద్రలు గుర్తింపు

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది

By -  Knakam Karthik
Published on : 15 Feb 2026 8:00 PM IST

Tiger Scare, Pugmarks, Telangana, Siddipet, Vithalapur, High Alert, Forest Officials

సిద్ధిపేట జిల్లాలో పులి భయం..ఆ గ్రామ పొలిమేరల్లో పాదముద్రలు గుర్తింపు

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మండలంలోని విఠలాపూర్ గ్రామ శివారులో పెద్దపులి తిరుగుతున్నట్లు వార్తలు రావడంతో గ్రామస్థులు వణికిపోతున్నారు. విఠలాపూర్ గ్రామ పొలిమేరల్లో పెద్దపులికి సంబంధించిన పాదముద్రలను అటవీ శాఖ అధికారులు శనివారం రాత్రి గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.

గడిచిన కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ఏదో క్రూర మృగం తిరుగుతోందన్న ప్రచారం సాగుతుండగా, తాజాగా పాదముద్రలు లభ్యం కావడంతో గ్రామస్థుల భయం నిజమైంది. పులి ఎటువైపు కదులుతోంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది అనే విషయాన్ని కనిపెట్టడానికి అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. పులి ఆచూకీ కోసం అత్యాధునిక డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు. పొలాలు, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. గ్రామస్థులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అయితే గత వారం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో ఐదు పశువులను చంపిన పులి అంతకు ముందు, జనగాం ప్రాంతంలో రెండు గొర్రెలను చంపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ గత రెండు నెలలుగా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

ఏపీలోనూ పెద్దపులి హల్‌చల్

ఇటీవల, వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ గ్రామాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక మగ పులిని పూణేకు చెందిన రెస్క్యూ టీమ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ మద్దతుతో రాష్ట్ర అటవీ శాఖ పట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో ఆరు రోజులుగా మానవ ఆవాసాల గుండా తిరుగుతూ పశువులను చంపుతున్న ఆ పెద్ద పులి ఫిబ్రవరి 6న తూర్పు గోదావరిలోని రాయవరం మండలంలోని కూర్మపురం గ్రామంలో పట్టుబడింది. ఆ తర్వాత పులిని విశాఖపట్నం జూకు తరలించారు.

Next Story