కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు ముహూర్తం ఫిక్స్..!
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Sep 2023 8:58 AM GMTకాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు ముహూర్తం ఫిక్స్..!
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాక అసంతృప్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ మరో పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు కూడా కాస్త సమయం తీసుకున్నా సరే కానీ.. బీఆర్ఎస్ నుంచి అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకున్నాక అభ్యర్థులను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాలేరు నుంచి టికెట్ విషయంలో తుమ్మల నాగేశ్వరరావుకి భరోసా లభించినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో తమ్మల కాంగ్రెస్‌లో చేరిక ఖరారు అయ్యిందని అంటున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. తుమ్మలను ఆహ్వానిస్తూ ఖమ్మం నగరంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. 'తుమ్మలన్న రా.. కదిలిరా.. జనమంతా ప్రభంజనంలా నీ వెంటే' అని ఫ్లెక్సీల్లో ఆహ్వానం పలుకుతున్నారు. దాంతో.. ఆయన కూడా కాంగ్రెస్ ఆహ్వానాన్ని స్వాగతిస్తారని తెలుస్తోంది.
తుమ్మలతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి చర్చలు జరిపారు. తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగులేటి ఆయనకు ఆహ్వానం పలికారు. కాంగ్రెస్‌లో చేరికపై చర్చలు జరిపారు. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే అని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే ఇద్దరూ బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత కలవడం.. బీఆర్ఎస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. మరో వైపు సెప్టెంబర్ 3న తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఖమ్మం నుంచి బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని.. వీలైనన్ని స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంటుంది. ఇక మంచి అభ్యర్థులను నిలబెడితే గెలుపు తథ్యమని భావిస్తున్నారు.