విషాదం.. సింగరేణి బొగ్గుగనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి

Three workers killed in coal mine accident in Ramagundam. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల్‌ లాంగ్వాల్‌ ప్రాజెక్టులోని బొగ్గు గనిలో విషాద ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on  9 March 2022 8:29 AM IST
విషాదం.. సింగరేణి బొగ్గుగనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల్‌ లాంగ్వాల్‌ ప్రాజెక్టులోని బొగ్గు గనిలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొగ్గు గనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి చెందారు. వారి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. రెండు రోజుల కిందట ఆండ్రియాల్‌ బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు పైకప్పు కూలిపోయింది. కొద్దిరోజుల కిందట కూలిన పైకప్పును సరిచేస్తుండగా మళ్లీ ప్రమాదం సంభవించింది. పైకప్పు కూలడంతో ఆరుగురు కార్మికులు గనిలో చిక్కుకుపోగా.. ప్రమాదం జరిగిన నాడు ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారు. నిన్న సాయంత్రం బదిలీ వర్కర్‌ రవీందర్‌ను సహాయక సిబ్బంది రక్షించారు. ఇక మిగతా ముగ్గురిని కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ చైతన్య తేజ చనిపోయి కనిపించారు.

అలాగే శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరు కార్మికులు సేఫ్టీ మేనేజర్‌ జయరాజ్‌, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్‌లు విగత జీవులుగా కనిపించారు. వారి మృతదేహాలను బయటకు తీసిన సిబ్బంది.. సింగరేణి ఆస్పత్రికి తరలించారు. బొగ్గు గనిలో సపోర్టు కోసం ఏర్పాటు చేసే పిల్లర్‌ను తొలగించడంతోనే ప్రమాదం జరిగిందని తెలిసింది. బొగ్గు తవ్వే మార్గంలో ఒత్తిడి తట్టుకునేలా, పైకప్పు దన్నుగా ఉంచేందుకు పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. అయితే ఆండ్రియాల్‌ గనిలో కూడా 86 నుండి 87 లెవల్‌ వరకు ఉండే మూడు పిల్లర్లలో ఒకదాన్ని తొలగించడంతో తీవ్ర ఒత్తిడికి గురై పైకప్పు పడిపోయింది. ఆ కూలిన ప్రాంతాన్ని సరి చేస్తుండగా పైకప్పు మళ్లీ కూలి సిబ్బందిపై పడటంతో ప్రమాదం జరిగింది.

Next Story