హైదరాబాద్‌లో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్ అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు.
By అంజి Published on 7 Sept 2023 11:20 AM ISTహైదరాబాద్‌లో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అడ్డగుట్ట సొసైటీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి నలుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కిందపడ్డారు. వారిలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. బాధితులు చికిత్స పొందుతున్నారు. అడ్డగుట్టలో మెయిన్ రోడ్డు పక్కనే భవన నిర్మాణం జరుగుతోంది. భవనంలోని ఆరవ అంతస్తులు పిట్టగోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ప్రమాదం జరిగింది.
పిట్టగోడతో పాటు సెంట్రింగ్ కర్రలు విరిగి కార్మికులు కింద పడిపోయారు. వారిలో ముగ్గురు అక్కిడక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతులు బీహార్ కార్మికులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన కార్మికులు, గాయపడ్డ కార్మికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ వర్షాల కారణంగా ఈ గోడ కూలిందా ? లేక నిర్మాణ లోపమా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణంలో భాగంగా జీ 4 కు అనుమతులు తీసుకుని, జీ 5 నిర్మిస్తున్నట్లు సమాచారం.