మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటవరం స్టేజీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు 31 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. మృతులను అడ్రస్ ఉన్నిసా (70), హసన్ (35), ఎల్లమ్మ (45) గా గుర్తించారు.
క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విషయాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. పోలీసుల సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడ్డాకుల సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.