బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అందించింది

By -  Knakam Karthik
Published on : 4 Nov 2025 4:59 PM IST

Telangana, Weather News, Hyderabad Meteorological Centre, Rain Alert

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిందని, వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు.

ముఖ్యంగా మంగళవారం రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇక బుధ, గురువారాల్లో సైతం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Next Story