ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే.. సుప్రీం సంచలన తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు గురువారం వెలువరించింది.
By Knakam Karthik
ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే.. సుప్రీం సంచలన తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు గురువారం వెలువరించింది. బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు తుదితీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ (ద్రోహాలు) జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వీటిని నియంత్రించకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. పార్లమెంట్‌లో రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షీల వంటి నేతలు చేసిన ప్రసంగాలను పరిశీలించాం. అనర్హతపై నిర్ణయం తీసుకోవడం స్పీకర్‌కు అప్పగించడం వల్ల న్యాయస్థానాల్లో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవచ్చు. ఈ అంశం విస్తృత ధర్మాసనం ఎదుట ఉంది కనుక తాము తీర్పు ఇవ్వలేమన్న వాదనను వినిపించారు. కిహోటో హొల్లోహన్ కేసును పరిశీలించాం. ఆర్టికల్ 136, 226, 227 క్రింద న్యాయ సమీక్షకు పరిమితి ఉంటుంది. సింగిల్ జడ్జి నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తప్పుగా సమీక్షించింది. సింగిల్ జడ్జి స్పీకర్‌కు సమయపాలన ఆదేశించలేదు. స్పీకర్ విచారణాధికారిగా వ్యవహరిస్తున్నప్పుడు ట్రిబ్యూనల్‌గా పరిగణించబడతారు. అప్పట్లో రాజ్యాంగ పరిరక్షణ వర్తించదు. కావున మేము ప్రస్తుత అప్పీల్‌ను అనుమతిస్తున్నాం. నవంబర్ 22, 2024న డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వు రద్దు చేయబడింది. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై విచారణను త్వరితగతిన ముగించాలి. గరిష్ఠంగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఎమ్మెల్యే విచారణను ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తే, స్పీకర్ ప్రతికూలంగా అర్థం చేసుకోవాలి..అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి” అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, ద్రోహం చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం అసాధ్యంగా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గంభీరమైన ప్రమాదంగా మారిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.