ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు నల్గొండ కోర్టు శిక్ష విధించింది.
By అంజి Published on 10 March 2025 12:33 PM IST
ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు నల్గొండ కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.
ప్రణయ్ హత్య కేసు:
ఈ హత్య సెప్టెంబర్ 14, 2018న జరిగింది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. అతను అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇది ఆమె తండ్రి టి మారుతీ రావుకు కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ శర్మకు రూ.1 కోటి ఇచ్చి ప్రణయ్ హత్యకు మారుతీరావు కుట్ర పన్నాడు. అస్గర్ అలీ, అబ్దుల్ భారీ, ఎంఏ కరీం, శ్రావణ్ కుమార్, ఆటో డ్రైవర్ నిజాం, మారుతీ రావు కారు డ్రైవర్ శివ ఇతరులు నిందితులుగా ఉన్నారు.
ప్రణయ్ తండ్రి పి బాలస్వామి ఫిర్యాదు మేరకు, పోలీసులు ఎనిమిది మందిని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు. 2019లో సుభాష్ శర్మ తప్ప మిగతా వారందరికీ బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడైన మారుతీరావు మార్చి 7, 2020న ఆత్మహత్య చేసుకుని మరణించాడు.