మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..ఆ పరిధి పెంచుతూ ఉత్తర్వులు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 March 2025 8:04 AM IST
మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..ఆ పరిధి పెంచుతూ ఉత్తర్వులు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి ఇకపై 10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. దీనిపై ఇటీవలే కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో 11 జిల్లాలు, 104 మండలాలు, 36 రెవెన్యూ, 1355 గ్రామాలు, ఇలా మొత్తం 0 వేల 472.72 చదరపు కిలోమీటర్లు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం HMDA పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు చేరాయి. ప్రారంభ సమయంలో దీని విస్తీర్ణం కేవలం 650 చదరపు కిలోమీటర్లే ఇప్పుడు అది పదివేల కిలోమీటర్లకు చేరింది. 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాను ఏర్పాటు చేశారు. అప్పటి దీని విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు. దీన్ని 2008 వరకు ఎవరూ మార్చలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హుడాను కాస్త HMDAగా మార్చేశారు. పరిధిని కూడా 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. ఇప్పుడు మరోసారి విస్తరించారు. దీంతో HMDA పరిధి10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది.
ఈ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. ఓఆర్‌ఆర్(ORR) నుంచి రీజినల్ రింగు రోడ్డు(RRR) వరకు వరకు ప్రజారవాణాకు పెద్దపీట వేయనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. రేడియల్ రహదారులు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు.